అబ్రాహాము దేవదూతలకు ఆతిధ్యమిచ్చుట

అబ్రాహాము అతిధులను తన ఇంట చేర్చుకున్నప్పటినుండి, వారు తిరిగివెళ్ళేవరకు శక్తివంచనలేకుండా,

Posted November 11,2018 in Social.

Amruthavani
86 Followers 531 Views

అబ్రాహాము, దేవునిని అలసట తీర్చుకోమని చెప్పి, భోజనం సిద్ధంచేసే పనిలోపడ్డారు. ఇక్కడ మనకొక సందేహం తప్పక రావొచ్చు. దేవుడు అలసట తీర్చుకోవడమేమిటి? భోజనం చెయ్యడమేమిటి? అవును. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు ముందు, అదృశ్యునిగాను, వాక్యముగాను ఆయన ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడైతే మానవునిగా ప్రత్యక్షమయ్యారు అనే విషయం తప్పక జ్ఞాపకం పెట్టుకోవాలి. శరీరంతో నున్నప్పుడు ఇవన్నీ సహజం కదా? ఒక వేళ అబ్రాహాము నన్నెంతగా గౌరవిస్తాడో చూద్దామని ప్రభువు ఆ రీతిగా ప్రత్యక్షమయ్యారేమో?

అబ్రాహాము గుడారములో నున్న శారాయొద్దకు త్వరగావెళ్లి నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. (ఆది 18:6-8) అబ్రాహాము విందును సిద్ధంచేసే క్రమంలో వాడబడిన మాటలు చూస్తే, అతడెంత వేగముగా సిద్ధం చేసాడో అర్ధమవుతుంది. త్వరగా వెళ్లి, నీవు త్వరపడి, మందకు పరిగెత్తి, త్వరగా సిద్ధపరచెను ఆలస్యమునకు ఎక్కడా తావులేదు.

అబ్రాహాము త్వరగా శారా దగ్గరకు వెళ్లి:

అబ్రాహాము గుడారములోనున్న తన భార్యయైన శారా దగ్గరకు త్వరగా వెళ్లి, మెత్తని పిండితో రొట్టెలను త్వరగా సిద్దముచెయ్యమని చెప్పాడు. తెలుగులో మెత్తని పిండి అని వ్రాయబడిందిగాని, ఇంగ్లీష్ బైబిల్ లో finest flour అని వ్రాయబడింది. అనగా శ్రేష్ఠమైన పిండి మన దగ్గర ఉన్నదానితో శ్రేష్ఠమైన పిండితో రొట్టెలు సిద్ధంచెయ్యమని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము అబ్రాహాము ఇంటిలో 1200 మంది పనివారు ఉండేవారట. 90 సంవత్సరాల వృద్ధ్యాప్యములోనున్న శారా కంటే, యౌవనప్రాయంలోనున్న అనేకమంది దాసీలు వున్నారుకదా, రొట్టెలు చేసే పని వారికి అప్పగించవచ్చుకదా? లేదు. అతిధులకు విందును సిద్ధంచేసే భాద్యతను వారిద్దరే తీసుకున్నారు. వారి చేతులతో పెట్టడమే వారికి సంతృప్తి. శారా కూడా సంతోషంతో సిద్ధపరచడానికి వేగిరపడిందిగాని, సణిగినట్లుగాని, సాకులు చెప్పినట్లుగాని మనకు కనబడదు. నేటిదినాల్లో కొందరు యౌవనప్రాయంలోనున్న స్త్రీలు సహితం ఒక సేవకునికి ఒకపూట ఆహారం సిద్ధపరచడానికి ఎంత బాధపడిపోతారో? అందరూ కాదులెండి కొందరు, ఆ కొందరిలో నీవుండకూడదు. ఆతిథ్యము చేయ మరవకుడి దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి (హెబ్రీ 13:1). బహుశా ఈ మాటలు అబ్రాహాము, శారాలను దృష్టిలోపెట్టుకొనే వ్రాయబడ్డాయేమో?

అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి:

అబ్రాహాము, పశువుల మందకు వెళ్లి దూడను తెచ్చే భాద్యతను పనివానికి అప్పగించే ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే, ఒకవేళ వారు ఏ జబ్బుదో, మచ్చ, డాగు కలిగినదో తీసుకొని వస్తారేమోనన్నది అబ్రాహాము భయం. అందుచే, 99 సంవత్సరాల వయస్సులో తానే పశువుల మందకు పరిగెత్తుతున్నాడు. మందకు వెళ్ళాక రా! వచ్చి నన్నుపట్టుకో అంటుందా ఆ దూడపిల్ల? మరలా దాని వెంట పరుగుతీసాడు. ఒక మంచి లేత దూడను తెచ్చి, పనివానికప్పగించాడు. తర్వాత దినాలలో దేవునికి బల్యర్పణగా లేత దూడలనే అర్పించినట్లు లేఖనాల ద్వారా గ్రహించుచున్నాము. అబ్రాహాము యొక్క హడావిడి చూచి, అతడెంత తొందరపడుతున్నాడో గుర్తెరిగి, అతడునూ దానిని త్వరగా సిద్ధం చేసాడు. తద్వారా విందు సిద్ధం చేయబడింది. అవును దేవునికిచ్చేది ఏదైనా శ్రేష్ఠమైనదే ఇవ్వాలి. అబ్రాహాము దాని విషయంలో ఎక్కడా రాజీ పడినవాడు కాదు. మేము చర్చ్ లో చివర్లో కానుకలు లెక్కించేటప్పుడు, దానిలో కొన్ని నోట్స్ కనిపించేవి. అవి భారతదేశంలో ఎక్కడా చెల్లవన్నమాట. అట్లాంటి నోట్స్ తీసికొనివచ్చి కానుక సంచిలో వేసేవారు. ఎంతటి విచారకరం? దేవునికిచ్చేది ఏదైనాసరే శ్రేష్ఠమైనదే ఇవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా నీ పవిత్రమైన హృదయాన్ని ప్రభువుకివ్వాలి. అంతకంటే ఆయన ఇష్టపడే కానుక మరొకటిలేదు.

అతిధులు విందారగిస్తున్నప్పుడు వారిని కనిపెట్టుకొని వున్నాడు:

తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయు చుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను (ఆది 18:8). వారి ప్రాణములను బలపరచుకొని, ప్రయాణమై వెళ్ళాలి కాబట్టి వారికి శ్రేష్ఠమైన పౌష్టికాహారాన్ని సిద్దము చేయించాడు. అబ్రాహాము గుడారములో డైనింగ్ టేబుల్స్ లేవు. ఆ చెట్టు నీడనే వారు భోజనం చెయ్యడానికి ఏర్పాటు చేసాడు. వారు భోజనము చేయుచున్నప్పుడు అబ్రాహాము ఆ చెట్టు క్రింద నిలచియున్నాడు. అప్పటికే అబ్రాహాము పూర్తిగా అలసిపోయాడు. ఆ చెట్టుక్రిందనే కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా? లేదు. వారికి ఏమి కావాలో వాటిని వడ్డించడానికి కనిపెట్టుకొని వున్నాడు. ఇంతకు మించిన ఆతిధ్యం ఇంకెవరివ్వగలరు? అబ్రాహాము కుటుంబ ఆతిధ్యం మన క్రైస్తవ కుటుంబాలకొక మాదిరి అని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేనేలేదు.

వారు ఆహారాన్ని భుజించి వారిదారిన వెళ్లిపోయే ప్రయత్నం చెయ్యలేదు, ప్రభువుకు, సువార్త చెప్పడానికి పేతురు దోనెలో కొంచెం స్థలమిచ్చినందుకే ఆ దోనేనంతటిని చేపలతో నింపేశారు ప్రభువు. మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను. (మార్కు 9:41) అట్లాంటప్పుడు యింత అద్భుతమైన ఆతిధ్యమిచ్చిన అబ్రాహాము, శారాలను వట్టి చేతులతో విడచిపెట్టి వెళ్ళిపోతారా? సంవత్సరాల తరబడి వారు ఎదురుచూస్తున్న బహుమానం ఏదైతే వుందో, ఆ శ్రేష్టమైన బహుమానమును గూర్చిన మరింత స్పష్టత ఇవ్వడానికి వారు సిద్దపడుతున్నారు. దానిలో భాగంగా, శారా ఎక్కడుందని అడుగుతున్నారు? దానికి అబ్రాహాము సమాధానం అదిగో గుడారములో నున్నదని చెప్పెను. (ఆది 18:9). భర్తచేప్పినట్లుగానే గుడారంలోనే తనపని చేసుకొంటుందిగాని, తననుతాను కనపరచుకొనే ప్రయత్నమేమి చెయ్యలేదు. ఇది ఉత్తమ ఇల్లాలు యొక్క అత్యుత్తమ లక్షణం. నేటి పరిస్థితి మారింది భర్త ఇంట్లో వుంటే, భార్య వీధిలో వుండే పరిస్థితి. మేము భర్తతోపాటు సంపాదించడం లేదా? మేమెందుకు లోబడాలి అంటూ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. భర్తతోపాటు కాదు, భర్తకంటే ఎక్కువ సంపాధించినాసరే, కుటుంబంలోగాని, సంఘములోగాని, సమాజములోగాని నీవు గుడారంలో వుండే అనుభవం కలిగివుండడమే నీ ఆధ్యాత్మిక జీవితానికి శ్రేయస్కరం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను (లూకా 1:28) దూత లోపలి వచ్చాడంటే, మరియ ఎక్కడుంది? ఇంటిలో వుంది. శారా గుడారములో ఉండడానికి ఇష్టపడింది కాబట్టే, అనేక జనములకు తల్లి అయ్యింది. మరియ ఇంటిలో ఉండడానికి ఇష్టపడింది కాబట్టే రక్షకునికి తల్లి అయ్యింది. ఒక క్రైస్తవ స్త్రీగా నీవెక్కడుండాలో వాక్యపు వెలుగులో నీవే తేల్చుకో. శారా మాత్రం గుడారములో వుండే అనుభవాన్ని కలిగివుందని మాత్రం గుర్తుపెట్టుకో. ఆరీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

Tags: Abraham,
Amruthavani Articles